1 Jul 2022

2022 - తెలుగు సినిమా ఫస్ట్ హాఫ్

 


టాలీవుడ్ 2022 అనే చిత్రం బ్రహ్మాండమైన విడుదల అయ్యి నిన్నటితో ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకుంది. మరి ఫస్ట్ హాఫ్ టాక్ ఏంటి, హిట్టా లేక ఫట్టా....

వివరాల్లోకి వెళ్తే మన సినిమా మొదలు అయ్యిందే ఉత్కంఠ పరమైన సీక్వెన్స్ తో. సంక్రాంతికి నువ్వా నేనా అని నాలుగు చిత్రాలు పోటీపడ్డాయి, పోనీ అవేమన్నా చిన్నా చితకా సినిమాలా అంటే అవి RRR, రాధే శ్యామ్, భీమ్లా నాయక్, బంగార్రాజు. ఇంత మంది హీరోలను చూసి తట్టుకోలేకపోయిన విలన్ కరోనా తన పంజా విసిరి మూడింటిని వెనక్కి తోసి ఒక్క బంగార్రాజు మాత్రం విడుదలయ్యింది. చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాదించింది. దానితో పాటు వచ్చిన రౌడీ బాయ్స్, హీరో చిత్రాలు కూడా ఫరవాలేదు అనిపించాయి.

ఇలా ఇంటరెస్టింగ్గా  స్టార్టైన ప్రయాణం క్రైమ్ థ్రిల్లర్ బాట పట్టి డిజె టిల్లుతో కామెడీ వర్షం కురిపిస్తే ఖిలాడీతో చతికిలపడింది. నీ దారి ఏదైనా కానీ నా దారి రహదారి అని వచ్చిన సొన్ అఫ్ ఇండియా ఎప్పుడు దారి తప్పిపోయిందో ఎవరు గమనించలేదు. కామెడీ సరే, మరి ఇంత సేపు ఏక్షన్ లేకపోతే ఎలా అని వచ్చేసింది భీమ్లా నాయక్. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా స్టార్ట్ అయ్యి టాలీవుడ్ ఎమోషన్ ని పీక్ కి తీసుకెళ్లేలా కనిపించినా మెల్లిగా చల్లబడి చివరికి ఫరవాలేదనిపించింది.

అన్ని పాళ్ళు కుదిరాయి కానీ ఇప్పటి వరకు సెంటిమెంట్ పండలేదు కదా అని వచ్చిన ఆడాళ్ళు మీకు జోహార్లు బలమైన కధా కధనం లేక నిరాశ మిగిల్చింది. సెంటిమెంట్ లేకపోతేనే ప్రేమ ఉంటుందిగా అని వచ్చిన రాధే శ్యామ్ అటు ప్రేమని ఇటు విధిని సరిగా బాలన్స్ చేయలేక డిసాస్టర్ గా మిగిలింది. అరెరే ఏంటిది సినిమా ప్లాప్ దిశగా సాగుతుంది అనుకుంటున్నప్పుడు వచ్చింది మాన్స్టర్ RRR. నీకు ఎమోషన్ కావాలి చెప్పు అన్నట్టు తీసిన సినిమా అనుకున్నట్టు గానే భారీ హిట్ అయ్యి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి నెలకొల్పిన రికార్డులని చెరిపేసింది.

 

ఒక్క సీక్వెన్స్ చాలు ఫస్ట్ హాఫ్ కి అని సంబరపడుతున్న ప్రేక్షకులకి అప్పుడేనా, ఇంకా ఉంది అని వచ్చి డబల్ మసాలా బిర్యానీ పెట్టింది కెజిఫ్2. డబ్బింగ్ చిత్రమైన కానీ తెలుగులో భారీ వసూళ్లు కురిపించిన చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. రెండు చిత్రాల మధ్యలో వచ్చిన ఘని రెండు టిప్పర్ల మధ్యలో నలిగిపోయిన నిమ్మకాయ అయ్యింది. మరి ఇంత భారీ హిట్లు వచ్చి కళకళలాడుతున్న ఇండస్ట్రీకి  దిష్టి చుక్క లేకపోతే ఎలా. లోటుని తీర్చేసింది ఆచార్య. సినిమా విడుదల నుండి ప్రేక్షకులని ఆకట్టుకోలేక భారీ డిసాస్టర్ గా నిలిచింది.

ప్రీ ఇంటర్వెల్ బానే ఉంది, ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఘనంగా ఇద్దాం అని వచ్చాయి సర్కారు వారి పాట, F3. రెండు చిత్రాలు అనుకున్నంత భారీ విజయాలు సొంతం చేసుకోలేకపోయాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫరవాలేదనిపించాయి. చిన్న చిత్రంగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా కొంచం నవ్వుని కొంచం సెంటిమెంట్ ని పండించింది.

ఇక మిగిలింది జూన్ నెల. దీని ప్రారంభం మేజర్ తో బాగా జరిగినా తరవాత వచ్చిన అంటే సుందరానికి, విరాట పర్వం, సమ్మతమే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిల పడ్డాయి. సమ్మతమే మాత్రం కాస్త ఫరవాలేదనిపించింది.

చివరగా మాట్లాడుకోవాల్సింది డబ్బింగ్ చిత్రాల గురించి. సంవత్సరం ఇప్పటి వరకు వీటికి కూడా మంచి మార్కులే పడ్డాయి. కెజిఫ్ 2 లాంటి చిత్రం భారీ హిట్ ఐతే విక్రమ్, డాన్ లాంటి చిత్రాలు హిట్ గా నిలిచాయి. అంచనాలతో వచ్చి ఆశించిన హిట్ అందుకొని  చిత్రాలు మాత్రం బీస్ట్, వలిమై. ఓటిటి లో వచ్చిన సినిమాల్లో ది అమెరికన్ డ్రీం, బ్లడీ మేరీ కాస్త ఫరవాలేదనిపించాయి.

 

ఇక ఇలా టెన్షన్ గా మొదలైన సంవత్సరం, మెల్లిగా గ్రాఫ్ ని పెంచుతూ మధ్యలో పీక్ కి చేరి ఫస్ట్ హాఫ్ చివరికి వచ్చేసరికి కాస్త నెమ్మదించింది. మొత్తంగా చూస్తే ఇప్పటి దాకా జరిగినా సంవత్సరం హిట్ అనే చెప్పాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు ఎక్కువ శాతం బ్లాక్బస్టర్ లు కాకపోయినా ఫరవాలేదనిపించాయి. చిన్న సినిమాలు కూడా తమ సందడి బానే చేసాయి. మరి ఫస్ట్ హాఫ్ లో ఫిబ్రవరి-ఏప్రిల్ ఇచ్చిన పీక్ ఎమోషన్ కి ఫస్ట్ హాఫ్ హిట్ అనక తప్పదేమో మరి.

No comments:

Post a Comment