26 Nov 2022

Panchatantram Trailer: పంచేంద్రియాల థీమ్ తో ఆకట్టుకున్న పంచతంత్రం ట్రైలర్

Panchatantram Trailer designed very attractively


ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఒక ఆసక్తికరమైన పాత్రలో.. కలర్స్ స్వాతి రెడ్డి, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ''పంచతంత్రం''. కొత్త దర్శకుడు హ‌ర్ష పులిపాక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'పంచతంత్రం' నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమా పై ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తిని ఏర్పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ట్రైలర్ చూస్తే పంచతంత్రం సినిమా ఐదు కథల సమాహారంగా కనిపిస్తుంది. బ్రహ్మానందం ఈ కథలను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ కథలను చెప్పేందుకు దృష్టి - వాసన - ధ్వని - రుచి - స్పర్శ వంటి పంచేంద్రియాల థీమ్ ని ఎంచుకున్నారు.

ఇందులో కలర్స్ స్వాతి వికలాంగురాలైన ఒక రేడియో జాకీగా కనిపిస్తున్నారు. సముద్రఖని - దివ్యవాణి భార్యా భర్తలుగా.. ప్రేమ వివాహం చేసుకున్న జంటగా వికాస్ ముప్పాల - దివ్య శ్రీపాద.. ప్రేమికులుగా రాహుల్‌ విజయ్‌ - శివాత్మిక రాజశేఖర్ కనిపించారు. ఆదర్శ్ బాలకృష్ణ - ఉత్తేజ్ - నరేష్ అగస్త్య - శ్రీవిద్య ఇతర పాత్రలు పోషించారు.

వీరందరిదీ ఒక్కో కథ.. అన్ని కథలు ఎలా ఒక చోటికి చేరతాయో లేక వేటికవే ప్రత్యేకంగా ఉంటాయో సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఆలోచింపజేసే సంభాషణలతో పాటు హృద్యమైన భావోద్వేగాలతో ట్రైలర్ నిండింది.

ట్రైలర్ చూస్తుంటే.. 'పంచతంత్రం' అనేది నేటితరం ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చేలా కనిపిస్తోంది. సంగీతం మరియు విజువల్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి.

ప్రశాంత్‌ ఆర్‌ విహారి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ డైలాగ్స్ రాశారు. రాజ్‌ కె నల్లి సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

టికెట్‌ ఫ్యాక్టరీ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై అఖిలేష్‌ వర్ధన్‌ - సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ''పంచతంత్రం'' చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన పంచతంత్రాలు ట్రైలర్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

No comments:

Post a Comment