27 Dec 2022

Dhamaka: బాక్సాఫీస్ వద్ద తగ్గని ధమాకా జోరు

Dhamaka refuses to slow down at the box office


మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ధమాకా బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా దూసుకుపోతోంది. నిజానికి తొలి రోజు కాస్త విరుద్ధమైన సమీక్షలను తెచ్చుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, మాస్ ప్రేక్షకుల అప్రతీహాత ఆదరణతో బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తుంది.

ఆదివారం సెలవుదినం మరియు క్రిస్మస్ పండుగ కావడం, అందులోనూ సినిమా విడుదలై మూడవ రోజు కావడంతో ఆరోజు సినిమా గట్టి వసూళ్లు రాబడితే అది సాధారణమైన విషయం అనుకోవచ్చు. కానీ నాలుగో రోజు కూడా ధమాకా పెద్దగా డ్రాప్‌ని చూడలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాలుగవ రోజు వచ్చిన వసూళ్లు దాదాపు మొదటి రోజు వసూళ్లకు సమానంగా ఉండటమే.

నాలుగు రోజుల వ్యవధిలో ధమాకా ప్రపంచ వ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 19 కోట్లకు జరుపుకోగా.. కేవలం నాలుగు రోజులలోనే ఆ మార్కును దాటేయడం విశేషం. 

ఆసక్తికరంగా, అనేక థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరియు ఇతర ప్రాంతాలలో కూడా ఆక్యుపెన్సీ చాలా బాగుంది. అలాగే, యుఎస్ బాక్సాఫీస్ వద్ద ధమాకా $250K మార్కును అధిగమించింది.

త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చే వరకు పెద్దగా పోటీ ఉండదు. కాబట్టి అప్పటి వరకూ ధమాకా సినిమా డ్రీమ్ రన్ కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తానికి 2022 సంవత్సరానికి రవితేజ తనదైన శైలిలో ఘనమైన విజయంతో వీడ్కోలు పలికారు.

No comments:

Post a Comment